కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18 నుంచి 44 సంవత్సరాల వారికి నగదు చెల్లించి ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల సరఫరాను నిలిపివేసింది. తక్కువ ధరకు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులకు మళ్లించి కోట్లుదండుకుంటున్నట్లు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది.
రూ.400 వచ్చి టీకాను కొన్న రాష్ట్రప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1060కి అమ్ముతోందని, తిరిగి వాళ్లు ప్రజలకు రూ.1560కి వ్యాక్సిన్ వేస్తున్నారని అకాలీ నాయకుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ట్విట్టర్‌లో ఆరోపించారు. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న వ్యాక్సిన్లను తిరిగి అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సిన్ ఫండ్ కింద ఆస్పత్రులు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పింది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్ లోని అమరిందర్ సర్కారును ఆదేశించింది.