ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. నైట్ కర్ఫ్యూ
Punjab government imposes night curfew from 10pm to 5am.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 7:58 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించగా.. తాజాగా వాటి జాబితాలోకి పంజాబ్ చేరింది. ఆ రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేయడంతో పాటు ఈ రోజు నుంచి జనవరి 15 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. బార్లు, రెస్టారెంట్లు, సినిమా హాల్స్, స్పా సెంటర్లు మాత్రం 50 శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చునని తెలిపింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో ఆంక్షలపై ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కాలేజీలు, పాఠశాలలను వెంటనే మూసివేయాలన్నారు. అయితే.. ఆన్‌లైన్ క్లాసులు మాత్రం నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు. ఇక మెడికల్, నర్సింగ్ కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయన్నారు.
బార్‌లు, సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్స్ , స్పాలు, మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు 50 శాతం సామర్ధ్యంతో పనిచేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు హాజరుకావాలన్నారు. రాత్రి కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని.. ఈ ఆంక్షలు అన్ని ఈ నెల 15 వరకు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.
పంజాబ్‌లో డిసెంబర్ 28న 51 కేసులు నమోదైతే.. నిన్న ఏకంగా 419 కేసులు నమోదయ్యాయి. పాటియాల మెడికల్ కాలేజీలో కరోనా విజృంభించింది. మెడికల్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో విద్యార్ధులను ఐసోలేషన్ కు తరలించారు.