మూడో బిడ్డకు తండ్రి అయిన పంజాబ్‌ సీఎం..రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి

పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

By Srikanth Gundamalla  Published on  28 March 2024 9:45 AM GMT
punjab, cm bhagwant mann,  father, third time,

మూడో బిడ్డకు తండ్రి అయిన పంజాబ్‌ సీఎం..రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి

పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం ఉదయం సీఎం భగవంత్ మాన్ భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం భగవంత్‌ మాన్‌ తన అధికారిక ఎక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మొహాలీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో ఈ ప్రసవం జరిగినట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా సీఎం భగవంత్‌మాన్‌ షేర్ చేశారు. ఇక ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్‌ మాన్‌ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పంజాబ్‌ పునర్‌వ్యవస్థీకరణ చరిత్రలో పదవిలో ఉండగానే తండ్రి అయిన తొలి ముఖ్యమంత్రిగా భగవంత్‌మాన్‌ నిలిచారు. అయితే.. భగవంత్‌ మాన్‌ రెండేళ్ల కిందట గురుప్రీత్ మాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో వివాహం. మొదటి భార్యతో భగవంత్‌ మాన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు కెనడలో స్థిరపడ్డారు. మొదటి భార్యతో భగవంత్‌ మాన్‌ విడాకులు తీసుకున్న తర్వాతే రెండో వివాహం చేసుకున్నారు. భగవంత్‌మాన్‌ మొదటి భార్య పేరు ఇందర్‌ప్రీత్‌ కౌర్‌. వీరి వివాహబంధం ఆరేళ్ల పాటు సాగింది. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్‌ కౌర్‌ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్.

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మొదట హాస్యనటుడిగా కెరియర్‌ను ప్రారంభించారు. రాజకీయాల్లో చేరడానికి ముందే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2022 లో పంజాబ్‌లో ఆప్‌ విజయ సాధించడంతో ముఖ్యమంత్రిగా మార్చిలో బాధ్యతలు తీసుకున్నారు. ఇక అంతకుముందు సంగ్రూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు రెండుసార్లు ఎన్నిక అయ్యారు.


Next Story