దారుణం..ఓవర్ టేక్‌కు సైడ్ ఇవ్వలేదని మహిళ ముఖం పచ్చడి చేసిన వ్యక్తి
పుణెలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 10:30 AM ISTదారుణం..ఓవర్ టేక్‌కు సైడ్ ఇవ్వలేదని మహిళ ముఖం పచ్చడి చేసిన వ్యక్తి
పుణెలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వెళ్తూ ఉంది. అయితే.. ఓవర్ టేక్ చేసేందుకు కారులో ఉన్న వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె సైడ్ ఇవ్వలేదని కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కారు స్కూటీ ముందు ఆపై.. మహిళపై దాడి చేశాడు. ఆమె ముఖాన్ని పచ్చడి చేశాడు. ఈ దారుణ సంఘటనపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సిల్వా అనే మహిళ రోడ్డుపై తన ఇద్దరు పిల్లలతో కలిసి పాషన్-బ్యానర్ లింక్ రోడ్‌పై స్కూటీపై వెళ్తోంది. అప్పుడే వెనుక నుంచి కారు వచ్చింది. కారు హారన్ కొట్టారు. ఒకటికి రెండు సార్లు కొడుతూనే ఉన్నాడు. అయితే.. ఆ మహిళ బైక్‌ను ఎడమవైపుగా పోనిచ్చింది. కాసేపటికే కారు స్కూటీ ముందు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతు సిల్వా వద్దకు వచ్చి.. ఎందుకు సైడ్‌ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాదు.. అదే వేగంగా మహిళ ముఖంపై పంచ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై సదురు మహిళ ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'అతను చాలా ఆవేశంగా కారు దిగాడు. నన్ను రెండుసార్లు కొట్టి నా జుట్టు లాగాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతను వారి గురించి పట్టించుకోలేదు. ఈ నగరం ఎంత సురక్షితంగా ఉంది? ప్రజలు ఉన్మాదుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏదైనా జరిగి ఉండవచ్చు. ఒక మహిళ నాకు సహాయం చేసింది," అని సిల్వా వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో మహిళ ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూనే ఉంది. ఘటన సమయంలో కారులో వ్యక్తితో పాటు అతని భార్య ఉందనీ..ఆమె కనీసం ఆపేందుకు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
ఈ ఘటన తర్వాత పూణె పోలీసులు స్పందించారు. శనివారం జరిగిన ఘటనలో కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు కారు నడిపిన వ్యక్తితో పాటు.. అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు.