సైకో హల్‌చల్.. అర్ధరాత్రులు గోడలు దూకి.. మహిళల లోదుస్తుల చోరీ
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో గత కొన్ని రోజులుగా మహిళల లోదుస్తులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వింత దొంగతనాలు స్థానికులను...
By - అంజి |
సైకో హల్‌చల్.. అర్ధరాత్రులు గోడలు దూకి.. మహిళల లోదుస్తుల చోరీ
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో గత కొన్ని రోజులుగా మహిళల లోదుస్తులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వింత దొంగతనాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గంగావతి పట్టణంలోని సిబిఎస్ (CBS) కాలనీ వంటి ప్రముఖ నివాస ప్రాంతాల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయాల్లో కాంపౌండ్ గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఆరవేసిన మహిళల లోదుస్తులను మాత్రమే దొంగిలిస్తున్నాడు. ఈ దృశ్యాలు స్థానిక సిసిటివి (CCTV) కెమెరాల్లో రికార్డ్ అవ్వడమే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వింత ప్రవర్తనతో స్థానిక మహిళలు తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతున్నారు. నిందితుడిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా కర్ణాటకలో ఇటువంటి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులోని హెబ్బగోడిలో ఒక యువకుడు మహిళల లోదుస్తులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. అలాగే 2025 సెప్టెంబర్‌లో హుబ్బళ్ళిలో ఒక వ్యక్తి మహిళల లోదుస్తులను దొంగిలించి, వారం తర్వాత తిరిగి వాటిని వారి కాంపౌండ్లలోనే పడేసేవాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా వింత నిజాలు బయటపడ్డాయి.
ఈ తరహా నేరాల ప్రస్తావన వచ్చినప్పుడు కర్ణాటకకు చెందిన సీరియల్ రేపిస్ట్, కిల్లర్ ఉమేష్ రెడ్డి ఉదంతం గుర్తుకు వస్తుంది. 2002లో అతడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు షాకింగ్ విషయాలు గమనించారు. అతను మహిళల లోదుస్తులు ధరించి ఉండటమే కాకుండా, అతని వద్ద ఉన్న బ్యాగులో డజన్ల కొద్దీ బ్రాలు, ప్యాంటీలు, చీరలు, చుడీదార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అయిన ఉమేష్ రెడ్డి అనేక అత్యాచారాలు, హత్యలకు పాల్పడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ప్రస్తుతం గంగావతిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.