విమానంలో సీఎంకు నిర‌స‌న సెగ‌

Protest against Pinarayi Vijayan in Kannur-Thiruvananthapuram flight.కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజయన్‌కు విమానంలో చేదు అనుభ‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2022 6:56 AM GMT
విమానంలో సీఎంకు నిర‌స‌న సెగ‌

కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజయన్‌కు విమానంలో చేదు అనుభ‌వం ఎదురైంది. ఇద్ద‌రు యూత్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు న‌ల్ల చొక్కాలు ధ‌రించి సీఎంకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న చేపట్టారు.

అస‌లేం జ‌రిగిందంటే.. జూన్ 13న సీఎం పినరయి విజయన్ క‌న్పూరు నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు విమానం ఎక్కారు. అదే విమానంలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్యాసింజర్లు మాదిరిగా ఆ విమానం ఎక్కారు. తిరువనంతపురంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో.. విమానంలోనే న‌ల్ల‌చొక్కాలు ధ‌రించిన వారిద్ద‌రు సీఎం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. సీఎం ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు య‌త్నించ‌గా అప్ర‌మ‌త్త‌మైన ఎల్డీఎఫ్ క‌న్వీన‌ర్ ఈపీ జ‌య‌రాజ‌న్ వారిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర విచారణ జరపాలని కేరళకు చెందిన సీపీఎం ఎంపీ వీ.శివదాసన్‌ డీజీసీఏ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. అలా చేయడం విమాన భద్రత నిబంధనలకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. విమానంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

కాగా.. సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో నిందితురాలైన‌ స్వప్నా సురేష్.. ఇటీవల సీఎం పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పినరయి విజయన్​ కారణంగానే తాను బంగారం స్మగ్లింగ్​లో ఇరుక్కున్నట్లు తెలిపింది. కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌, ఆయన భార్య క‌మ‌లా విజ‌య‌న్‌, కూతురు వీణా విజ‌య‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ళిని నెట్టో, సీఎం అద‌న‌పు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సీఎం ర‌వీంద్ర‌న్‌, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జ‌లీల్‌ల‌కు ఈ కేసుతో సంబంధం ఉంద‌ని స్వ‌ప్న సురేశ్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో విప‌క్ష పార్టీలు రాష్ట్ర‌వ్యాప్తంగా న‌ల్ల జెండాల‌తో నిర‌స‌న‌లు చేప‌ట్టాయి. సీఎం రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Next Story