భారీ వర్షం.. ప్రైవేట్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. 8 మందికి తీవ్ర గాయాలు
భారీ వర్షం మధ్య గురువారం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ప్రైవేట్ జెట్ విమానం రన్‌వే నుండి అదుపు తప్పి క్రాష్ ల్యాండ్ అయ్యింది.
By అంజి Published on 15 Sept 2023 6:51 AM ISTభారీ వర్షం.. ప్రైవేట్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. 8 మందికి తీవ్ర గాయాలు
ముంబై: భారీ వర్షం మధ్య గురువారం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ప్రైవేట్ జెట్ విమానం రన్‌వే నుండి అదుపు తప్పి క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది వ్యక్తులు గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన తరువాత, విమానాశ్రయంలోని రెండు రన్‌వేలు కొద్దిసేపు మూసివేయబడ్డాయి. రన్‌వేలలో ఒకటి సాయంత్రం 6.47 గంటలకు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన లియర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విశాఖపట్నం నుంచి వస్తూ ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి స్కిడ్ అయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబై విమానాశ్రయంలోని రన్‌వే 27లో ల్యాండ్ అవుతున్నప్పుడు విమానం ఈ ఘటన జరిగిందని, విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని పేర్కొంది. భారీ వర్షాలతో ఘటన సమయంలో దృశ్యమానత 700 మీటర్లు ఉన్నట్లు రెగ్యులేటర్ కూడా తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి తెలిపారు. ముంబై పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, గాయపడిన ఎనిమిది మందిలో ఒక మహిళ, విమానం యొక్క పైలట్, కో-పైలట్ ఉన్నారు. పోలీసు మూలాల ప్రకారం, ప్రయాణీకులలో ఒకరు డెన్మార్క్ పౌరుడు. ఈ ఘటన సుమారు నిన్న సాయంత్రం 5 గంటల 8 నిమిషాల సమయంలో జరిగిందని ముంబై విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. “ఎలాంటి ప్రాణనష్టం లేదు.
CSMIA (ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) ఎయిర్‌సైడ్ టీమ్ ఆన్-సైట్ క్లియరెన్స్‌లో సహాయం చేయడానికి గ్రౌండ్‌లో ఉంది, ”అని పేర్కొంది. రన్‌వే 27 ఇప్పుడు DGCA, ATC క్లియరెన్స్ తర్వాత 6.47 గంటలకు కార్యకలాపాల కోసం తెరవబడిందని అధికారి ఒకరు తెలిపారు. ఒక రన్‌వే పనిచేయడానికి ముందు సుమారు గంట 45 నిమిషాల పాటు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు మూసివేయబడి ఉన్నాయని AAI అధికారి తెలిపారు. ఈ సమయంలో, అనేక విమానాలు ఇతర విమానాశ్రయాలకు మళ్లించబడ్డాయి. 39 విమానాలను వివిధ విమానాశ్రయాలకు మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో రెండు క్రాసింగ్ రన్‌వేలు ఉన్నాయి - 09/27, 14/32, ఇది సెకండరీ రన్‌వే. విమానం రన్‌వేపైకి దూసుకెళ్లిన తర్వాత చాలా నష్టం వాటిల్లిందని, డిసేబుల్ ఎయిర్‌క్రాఫ్ట్ రికవరీ కిట్ సహాయంతో దాన్ని తొలగించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. ప్రస్తుతం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు మాత్రమే ఈ రంగంలో సామర్థ్యం ఉందని అధికారి తెలిపారు.