మొబైల్ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. 20 రోజుల తర్వాత..
జైలులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగేశాడు.
By Srikanth Gundamalla Published on 4 May 2024 2:57 PM ISTమొబైల్ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. 20 రోజుల తర్వాత..
జైలులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. అయితే.. 20 రోజుల తర్వాత ఆపరేషన్ చేసిన వైద్యులు సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. కాగా.. అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందనీ.. కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
శివమొగ్గ సెంట్రల్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురామ్ అనే ఖైదీ గత కొన్నాళ్లుగా ఓ హత్య కేసులో శివమొగ్గ సెంట్రల్ జైలులో శిక్ష అనభవిస్తున్నాడు. అయితే.. గత కొద్ది రోజులుగా జైలులో ఉన్న పరశురామ్ తీవ్రమైన కడపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే జైలు అధికారులు పరశురామ్‌ను జైలులోని వైద్యుడికి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యుడు.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లి ఒకసారి స్కాన్ చేయించాలని సూచించాడు. దాంతో.. జైలు అధికారులు పరశురామ్‌ను మెగాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు పరశురామ్‌కు వైద్య పరీక్షలు చేశారు.. పొట్టను ఎక్సరే తీశారు. ఎక్స్‌రే రిపోర్టు చూసిన వైద్యులు, జైలు అధికారులు షాక్ అయ్యారు. పరశురామ్ పొట్టలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. ఇక మెగాన్ ఆస్పత్రిలో ఎండోస్కోపీ సౌకర్యం లేకపోవడంతో అధికారులు పరశురామ్‌ని ఏప్రిల్ 1న బెంగళూరులోని సెంట్రల్ జైలు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏప్రిల్ 6వ తేదీ వరకు పరశురామ్‌కి చికిత్స చేశారు. ఆ తర్వాత విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని వైద్యుడు సిఫార్సు చేశాడు. ఈ క్రమంలోనే వైద్యులు అతనికి ఏప్రిల్ 25వ తేదీన ఆపరేషన్ చేసి మొబైల్ ఫోన్‌ను బయటకు తీశారు. దాదాపు గంటన్నర సేపు ఈ ఆపరేషన్ కొనసాగిందని వైద్యులు చెప్పారు. ఇక ప్రస్తుతం పరశురామ్ కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.