ఇండియా పేరు మార్పు వివాదం: ఈసారి 'ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భారత్'

ఇండియా పేరుని మార్చి ఇక భారత్‌గానే దేశం పేరుని పిలవాలని కేంద్ర కసరత్తు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2023 6:59 AM GMT
Prime minister of Bharat, India name,  controversy,

ఇండియా పేరు మార్పు వివాదం: ఈసారి 'ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భారత్'

ఇండియా పేరుని మార్చి ఇక భారత్‌గానే దేశం పేరుని పిలవాలని కేంద్ర కసరత్తు చేస్తోంది. మొత్తానికి ఇండియా అని పిలవకుండా చేసేందుకు బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 9న జరిగే విందుకి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి లెటర్ విడుదలైంది. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అంటూ లేఖను విడుదల చేశారు. అయితే.. ఇంతకుముందు వచ్చిన లెటర్లలో ప్రెసిడెంట్‌ ఆఫ్ ఇండియా ఉండేది. మార్పు అప్పుడే మొదలు పెట్టారంటూ.. దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొందరు దీన్ని సమర్ధిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరోసారి వివాదం తెరమీదరకు వచ్చింది. ఈసారి ప్రధాని పేరుతో చర్చకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే 20వ ఆపియన్-ఇండియా సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. అంతేకాదు.. 18వ ఈస్ట్‌ ఏషియా సదస్సులోనూ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఆ వేడుక‌ల కోసం రూపొందించిన ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌(Prime Minister Of Bharat)గా రాశారు. దేశం పేరును మార్చాల‌ని కేంద్ర స‌ర్కార్ భావిస్తున్న నేప‌థ్యంలో.. ఆసియాన్ ఇన్విటేష‌న్ లేఖ‌లో ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన‌డం మరోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్రైమ్‌ మినిస్టర్ ఆఫర్ భారత్‌గా పేర్కొన్న ఇన్విటేషన్ కార్డును బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర తన సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇండియా పేరును తొలగించాలనే ఆలోచన సరికాదంటూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శల చేస్తున్న విషయం తెలిసిందే. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ వివాదం ఇంతకుముందు నుంచే ఉంది. గతంలో ఇండియా పేరును మార్చాలని సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే.. దేశం పేరును ఇండియాగానూ.. అలాగే భారత్‌గానూ పిలుచుకునే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ.. తాజాగా కేంద్రం ప్రయత్నాలు చూస్తుంటే దేశం పేరుని భారత్‌గానే ఉంచేందుకు ప్రయత్నాలు గట్టిగా చేస్తుందని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 18వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. అందులోనే బిల్లును కూడా ప్రవేశపెట్టే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్ర‌త్యేక సెష‌న్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఎజెండాను కేంద్ర స‌ర్కార్ వెల్ల‌డిచంలేదు.

ఇండియా పేరుని ఆంగ్లేయులు పెట్టిందిగా అందరికీ తెలిసిందే. అయితే.. బానిసత్వానికి సంబంధించిన ప్రతి ముద్రను చెరిపేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడే ఆ మాటను మోదీ సర్కార్‌ అమలు చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story