బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

By Srikanth Gundamalla  Published on  10 Feb 2024 5:54 PM IST
prime minister, narendra modi, speech, parliament ,

 బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. రిఫామ్, పర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్‌ జరిగాయని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో.. దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సమర్ధంగా పనిచేసినట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామనీ చెప్పారు. ఎంపీలంతా తమతమ జీతాలను బాధిత కుటుంబాలకు అందజేశారని చెప్పారు. అలాగే దేశంలో జరిగిన జీ20 సమావేశాలను సమర్ధంగా నిర్వహించామని అన్నారు. జీ20 సమావేశాలు ఇండియాలో నిర్వహించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ఖ్యాతి మరింత పెరిగిందని మోదీ అన్నారు. ఇక కొత్త పార్లమెంట్‌ కూడా నిర్మించుకున్నామనీ.. ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని రకాలుగా పనిచేశామన్నారు ప్రధాని మోదీ. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకున్నామన్నారు. దానివల్ల కశ్మీర్‌లో ప్రస్తుతం శాంతి నెలకొందని చెప్పారు. పేపర్‌ లీక్‌ల వల్ల నిరుద్యోగులు.. విద్యార్థులు నష్టపోతున్నారని ప్రధాని చెప్పారు. పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Next Story