సంక్షేమంలో పాలకులకు రామరాజ్యమే ఉదాహరణ: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 2:45 PM ISTసంక్షేమంలో పాలకులకు రామరాజ్యమే ఉదాహరణ: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయం గురించి ప్రస్తావించారు. అయోధ్యలో ఇటీవల జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండుగలా జరుపుకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ విదేశాల్లో రామ నామం మార్మోగిందని చెప్పారు. వసుదైక కుటుంబం అనే భావవను ప్రజలు చాటారని ప్రధాని అన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్‌ట సందర్భంగా ప్రజలందరి మాటల్లో, మదిలో రాముడే ఉన్నాడని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే.. దీపాంతాలను దేశమంతా వెలిగించి పండుగను జరుపుకొన్నట్లు చెప్పారు.
ఇక భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రదాని మోదీ వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా ఉండాలనేది.. ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే విషయాలకు రామ రాజ్యమే చక్కని ఉదాహరణ అన్నారు. రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలకు రాజ్యాంగ నిర్మాతలు స్థలం కేటాయించారని మోదీ గుర్తుచేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
గణతంత్ర వేడుకల్లో మహిళలు తమ శక్తిని చాటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరేడ్‌లో పాల్గొన్న 20 కంటింజెంట్స్‌లో 11 కంటింజెంట్లు మహిళలే అన్నారు. ఎక్కువగా మహిళలే నాయకత్వం వహించారరని చెప్పారు. మహిళలు ఇలా అన్నింట్లో ముందుండటం సంతోషంగా ఉందని అన్నారు. కళాకారుల్లోనూ వారే కనిపంచారనీ.. సంప్రదాయ సంగీత వాయిద్యాలు శంఖం, నాదస్వరం వంటి వాటిని కూడా మహిళలే వాయించారనీ ప్రధాని మోదీ చెప్పారు. మన దేశ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో చెప్పారు.