మోదీ అభిమానా మజాకా.. రూ.200 కోట్లతో ప్రధాని కాంస్య విగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో ఒకరైన ఓ వ్యాపారవేత్త తన వీరాభిమానాన్ని చాటుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 11:05 AM IST
మోదీ అభిమానా మజాకా.. రూ.200 కోట్లతో ప్రధాని కాంస్య విగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో ఒకరైన ఓ వ్యాపారవేత్త తన వీరాభిమానాన్ని చాటుకుంటున్నారు. మోదీపై ఉన్న అభిమానంతో 190 అడుగుల ఎత్తైన ప్రధాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అయితే.. ఈ విగ్రహ నిర్మాణానికి వ్యాపారవేత్త భూమి పూజ సోమవారమే ప్రారంభించారు. అయితే.. ప్రధాని మోదీ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
అస్సాంకు చెందిన వ్యాపారవేత్త నవీన్‌చంద్ర బోరా. ఈయన ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఆయన అభిమానాన్ని దేశం కాదు.. ప్రపంచమే గుర్తించేలా మోదీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 60 అడుగుల పీఠభాగంతో కలుపుకొని మొత్తం విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉండేలా కాంస్య విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారమే పూజా కార్యక్రమాలు మొదలు కాగా.. మూడ్రోజుల పాటు ఈ పూజ కొనసాగుతుందని నవీన్ చంద్ర వెల్లడించారు. ఇక మోదీ విగ్రహానికి సంబంధించి డిజైన్ కూడా ఖరారు చేశామని నవీన్ చంద్ర చెప్పారు. మోదీ విగ్రహం మెడ భాగంలో అస్సాం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అస్సాం ప్రజలు ధరించే ఖద్దరు వస్త్రం) ఉంటుందని నవీన్ చంద్ర బోరా వెల్లడించారు. ఈ విగ్రహం గౌహతి నగరానికి సమీపంలో ఉన్న ఆయన సొంత స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
విగ్రహ ప్రతిష్టాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు నవీన్ చంద్ర బోరా చెప్పారు. 2016లో మోదీ వీరాభిమాని నవీన్‌చంద్ర బోరా ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆ సమయంలోనే మోదీ విగ్రహాన్ని ఏర్ఆపటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సొంత డబ్బులతో, గౌహతిలోని సొంత స్థలంలో విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోదీ హాజరు అవుతారని ఆశిస్తున్నట్లు నవీన్ చంద్ర బోరా తెలిపారు. అయితే.. ఈ విగ్రహం ఏర్పాటుకు.. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వరల్డ్‌లోనే గ్రేటెస్ట్ లీడర్ అనీ.. ఆయన వీరాభిమానిగా మాత్రమే విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు నవీన్ చంద్ర బోరా చెప్పారు. ఇది తన అదృష్టంగా చెప్పుకొచ్చాడు.