ప్రధాని మోదీ, బిల్‌గేట్స్‌ 'చాయ్‌ పే చర్చ'

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ప్రధాని నరేంద్ర మోదీ చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  29 March 2024 5:15 AM GMT
prime minister, narendra modi, bill gates, meeting,

 ప్రధాని మోదీ, బిల్‌గేట్స్‌ 'చాయ్‌ పే చర్చ'

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ప్రధాని నరేంద్ర మోదీ చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో సాగింది. ఈ భేటీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. అయితే.. ఈ చర్చలో భారతీయులను బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. టెక్నాలజీని భారతీయులు చాలా వేగంగా ఆపాదించుకుంటున్నారని చెప్పారు. సాంకేతిక రంగంలో భారత్‌ దూసుకెళ్తున్నట్లు బిల్‌ గేట్స్ పేర్కొన్నారు.

చర్చలో భాగంగా డిజిటల్ విప్లవంలో భారత్‌ వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో భారత్‌ ముందుకు వెళ్తోందని అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన సమయంలో భారత్‌లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని చెప్పారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

జీ20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగిందనీ.. ఇండియా ఆ సదస్సును అద్బుతంగా నిర్వహించిందని బిల్‌గేట్స్ అన్నారు. భారత్‌లో డిజిటల్ విభజన జరగకుండా చూస్తానని అన్నారు. డిజిటల్ మౌళిక సదుపాయాలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్తానని ప్రధాని మోదీ చెప్పారు. కోవిడ్ కట్టడిలో భారత్‌ పాత్రను ప్రధాని మోదీ బిల్‌గేట్స్‌కు వివరించారు. డిజిటల్ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చిందని మోదీ అన్నారు. విద్యారంగంలో మార్పులకు టెక్నీలజీని వినియోగిస్తున్నామని అన్నారు. జీ20 సదస్సులో ఏఐ వినియోగించామన్నారు. టెక్నాలజీ వల్ల పేదలకు అన్ని అందుతున్నాయనీ.. చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోదీ తెలిపారు.

దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఎన్నో కార్యాక్రమాలను చేపట్టామని ప్రధాని మోదీ అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలు నివృత్తి చేశామని చెప్పారు. తన తల్లితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని కూడా మోదీ గుర్తు చేశారు. డిజిటల్‌ రంగంలో దేశం ముందుకు వెళ్తోందనీ.. డిజిటల్ మార్పులతో దేశానికి ప్రయోజనం జరిగిందనీ ప్రధాని మోదీ బిల్‌గేట్స్‌తో చెప్పారు.


Next Story