ఏనుగుపై సవారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 6:11 AM GMT
prime minister modi, assam tour, kaziranga park ,

ఏనుగుపై సవారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా అక్కడ పలు సాహసాల్లో పాల్గొన్నారు. ఇటీవల లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్, ఆ తర్వాత సముద్రంలో మునిగి ద్వారకకు స్కూబా డైవింగ్‌ చేసి మరీ వెళ్లి పూజలు చేశారు. రకరకాల విన్యాసాలు చేస్తూ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా అస్సాంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కజిరంగ నేషనల్‌ పార్క్‌ను తొలిసారి సందర్శించారు. అక్కడ కూడా పలు విన్యాసాల్లో పాల్గొన్నారు. ఏనుగుపై సవారీ చేశారు. జీపులో తిరుగుతూ అక్కడున్న ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆయన టూర్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1957 తర్వాత ఒక ప్రధాని అస్సాంలోని కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించారు. యునెసకో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కజిరంగ జాతీయ పార్క్‌ను గుర్తించారు. ఈ జాతీయ పార్క్‌లో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ కలియతిరిగారు. ఏనుగు ఎక్కి పార్క్‌లో తిరిగారు. రెండ్రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోనే పర్యటిస్తారు. శుక్రవారం అస్సాంకు వెళ్లిన ప్రధాని మోదీ.. ప్రత్యేక చాపర్‌లో గోలాఘాట్‌లోని కజిరంగకు వెళ్లారు. రాత్రి కజిరంగ పార్క్‌లోనే బస చేశారు. తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌ను సందర్శించారు. ముందు ఏనుగు ఎక్కి విహరించారు. ఆ తర్వాత జీపులో తిరిగారు.

కజిరంగ నేషనల్‌ పార్క్‌లో పర్యటించిన విషయాన్ని, ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ఈ కజిరంగ నేషనల్‌ పార్క్‌ ఎంతో అద్బుతంగా ఉందని చెప్పారు. దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఖడ్గమృగంతో సహా విభిన్న జాతుల వృక్షాలు, జంతువులు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అస్సాం ప్రజలతో పాటు అందరూ ఈ పార్క్‌ అందాలను వీక్షించాలని ప్రధాని మోదీ కోరారు.


Next Story