రామమందిర ప్రత్యేక క్రతువు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 12 Jan 2024 10:56 AM IST

prime minister modi, special message, ayodhya, ram mandir ,

రామమందిర ప్రత్యేక క్రతువు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని   

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే.. జనవరి 22న అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది అయోధ్య ట్రస్ట్. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టడమే కాదు.. యూట్యూబ్‌లో ఒక ఆడియో సందేశాన్ని పంచుకున్నారు.

రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజలకు ప్రాతినధ్యం వహించేందుకే దేవుడు తనని సృష్టించారనీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను 11 రోజుల పాటు ప్రత్యేక క్రతువుని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశ ప్రజలందరి ఆశీస్సులు కావాలని ఆయన కోరారు.


ఎప్పట్నుంచో ఎదురు చూసిన క్షణాలు ఇవి అని ప్రధాని చెప్పుకొచ్చారు. తన మనోభావాలను వ్యక్తపరచడం కూడా కష్టంగా ఉందన్నారు. భావోద్వేగానికి లోనవుతున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ చెప్పారు. జీవితంలో మొదటిసారి ఇలాంటి భావాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇక అటు 'ప్రాణ్‌ ప్రతిష్ట' వేడుకకు సంబంధించిన గ్రంథాలలో వివరించిన కఠినమైన మార్గదర్వకాలను అనుసరిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. మిగిలివున్న ఈ 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

Next Story