ఇవాళే రైతుల అకౌంట్లలోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటపెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2024 6:29 AM IST
prime minister modi, pm kisan money ,  nda govt,

ఇవాళే రైతుల అకౌంట్లలోకి డబ్బులు 

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటపెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ఏడాదికి రూ.6వేలు మూడు విడుతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడో సారి ఏర్పడింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే పీఎం కిసాన్‌ డబ్బులను విడుదల చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పీఎం కిసాన్‌ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ కానున్నాయి.

కాగా.. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన మూడోసారి ప్రధాని అయిన తర్వాత మంగళవార తన నియోజకవర్గం అయిన వారణాసికి తొలిసారి వెళ్తున్నారు. అక్కడ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ పథకం కింద రైతుల అకౌంట్లలోకి నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఇక ఇప్పటి వరకు 16 విడుతల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి. తాజాగా 17వ విడత డబ్బులను జమ చేస్తున్నారు. దీని కోసం రూ.20వేల కోట్ల నిధులను దేశ వ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల అవుతాయి. పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళే జమ కానుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం తర్వాత ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు దశాశ్వమేథ ఘాట్‌లో జరిగే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీని కోసం అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు.

Next Story