300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్.. ప్రధాని మోదీ ప్రకటన

సామాన్య ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 9:49 AM GMT
prime minister, modi,  solar power, 300 units free,

300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్.. ప్రధాని మోదీ ప్రకటన 

సామాన్య ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. మరోవైపు కరెంటు చార్జీలను భారీగా తగ్గిస్తామని కేంద్రం బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసింది. దీని అమలుకు కేంద్రం ముందడుగు వేసింది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు వీలుగా 'పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన' పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేశారు. దీని కోసం సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.

మరింత స్థిరైన అభివృద్ది, ప్రజల శ్రేయస్సు కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుతో.. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీనికింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకి బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చని చెప్పారు. దీని ద్వారా ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకురావాలని అధికారులకు సూచించారు ప్రధాని మోదీ. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంతో విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన కూడా జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. యువత ఈ ‘సూర్య ఘర్‌’ పథకాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. ఇందుకోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని అని మోదీ వెల్లడించారు.


Next Story