దేశాభివృద్ధి కొనసాగింపునకు బడ్జెట్ విశ్వాసమిచ్చింది: ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 2:46 PM ISTదేశాభివృద్ధి కొనసాగింపునకు బడ్జెట్ విశ్వాసమిచ్చింది: ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయా శాఖలకు కేటాయింపులను వివరించారు. దేశంలో కొద్దిరోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కొనసాగింపునకు బడ్జెట్ విశ్వాన్ని ఇచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇది అని చెప్పారు. దేశ అభివృద్ది కొనసాగింపునకు విశ్వాన్ని ఇచ్చిందని అన్నారు. వికసిత భారత్‌కు మూలస్తంభాలు అయిన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత కోసం ఈ బడ్జెట్ కృషి చేస్తుందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
సాంకేతిక రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని పేర్కొన్నార. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం గురించి ప్రకటించామని చెప్పారు. మహిళలను అధికారులను చేసే 'Lakhpati Didis' పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నామని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిపొందుతారని అన్నారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.