లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 9:00 AM ISTలోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
దేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ మధ్యాహ్నం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది కేంద్రం ఎన్నికల సంఘం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధించనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉందని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అని చెప్పారు. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీ తో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇలా ఎన్నో పథకాలను తీసుకురావడానికి, విజయానికి కారణంగా తమ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకమే కారణమని ప్రధాని మోదీ అన్నారు.
గత పదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తేవడంతో పాటు చట్టాలను రూపొందించినట్లు చెప్పారు ప్రధాని మోదీ. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇక వికసిత్ భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మనం కలిసి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు.