డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌..హైవేల పక్కన భవనాల నిర్మాణం: ప్రధాని

రహదారులపై ట్రక్కు డ్రైవర్లతో పాటు నిత్యం రోడ్లపై వెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు రెస్ట్‌ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 9:34 AM IST
prime minister modi, highway, building,  drivers, rest,

 డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌..హైవేల పక్కన భవనాల నిర్మాణం: ప్రధాని

రహదారులపై ట్రక్కు డ్రైవర్లతో పాటు నిత్యం రోడ్లపై వెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు రెస్ట్‌ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే అలసిపోయి నిద్రమత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రక్కు డ్రైవర్లతో పాటు.. ట్యాక్సీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. హైవేలపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆదునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు, మొదటి దశలో వెయ్యి భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 సమావేశలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనరంగంలో డ్రైవర్లది కీలక పాత్ర అని చెప్పారు. చాలా గంటల పాటు వాహనాలను నిరంతరాయంగా నడుపుతారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారికి రెస్ట్ ఉండదనీ.. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుందన్నారు. ఈ క్రమంలోనే హైవేల పక్కన ప్రత్యేక భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రభత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త పథకంలో భాగంగా.. భవనాల్లో ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు ఉంటాయని చెప్పారు. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అన్ని వసతులు ఉంటాయని ప్రధాని మోదీ వెల్లడించారు. పథకంలో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా వెయ్యి భవనాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

మరోవైపు ట్రక్కు డ్రైవర్ల కోసం కేంద్రం ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 2025 అక్టోబర్ 1 తర్వాత తయారు చేసే కొత్త ట్రకుల్లో డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్‌లను ఏర్పాటు చేసేలా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.

Next Story