వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ బలమైన పునాది: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 6:15 AM GMTవికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ బలమైన పునాది: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2017 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్‌ను ఈ సారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రదాని మోదీ తెలిపారు. పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల బాగుకోసం... అభివృద్ది కోసం తాపత్రయ పడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలనీ.. తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విన్నపం చేశారు. సమావేశాలను అర్థవంతంగా జరగడం కోసం.. ప్రజలకు ఉపయోగపడేలా చర్చలు కొనసాగేందుకు సహకరించాలన్నారు. గత చేదు అనుభవాలను పక్కనపెట్టి దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం కలిసి పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సభ్యులు వ్యవహిరంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి తమని తాము అంకితం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు మోదీ. 60 ఏళ్ల తర్వాత ఇది జరిగిందన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉండబోతుందన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అధికారాన్ని ఇచ్చారనీ.. దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. ఈ బడ్జెట్ 2047 నాటి మన కలల వికసిత్ భారత్‌కు పునాది అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.