మొదలైన రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు
Presidential Election Result 2022 Counting of votes begins.భారత తదుపరి రాష్ట్రపతి ఎవరో నేడు(గురువారం) తేలనుంది.
By తోట వంశీ కుమార్ Published on 21 July 2022 6:17 AM GMTభారత తదుపరి రాష్ట్రపతి ఎవరో నేడు(గురువారం) తేలనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనం రూమ్ నంబర్ 63లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంతరం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఒకసారి, 20 రాష్ట్రాలు పూర్తయిన తరువాత మరోసారి ఫలితాల సరళిని తెలపనున్నారు. లెక్కింపు మొత్తం పూర్తి అయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.
ఇక రాష్ట్రపతి పీఠం కోసం అధికార ఎన్డీయే కూటమి నుంచి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. కాగా.. ముర్ము మెజార్టీ ఉండడంతో ఆమె విజయం లాంఛనమేనని తెలుస్తోంది. ముర్ము విజయం సాధిస్తే రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం ఈ నెల 24తో ముగియనుండగా.. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ద్రౌపది ముర్ము ఓ ట్వీట్ చేశారు. జీవితం ఒక అద్దం.. మనం నవ్వినవ్వుడే అది నవ్వుతుంది అని రాసుకొచ్చారు.
जिंदगी एक आइना है, ये तभी मुस्कुराएगी जब हम मुस्कुरायेंगे!😊😊 pic.twitter.com/n4dVZFVoHd
— Droupadi Murmu • द्रौपदी मुर्मू (@DroupadiMurmu__) July 21, 2022
సంబరాలకు సిద్దమైన రామ్‌రంగపూర్
రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము విజయం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తుండడంతో ఆమె స్వస్థలంలో భారీ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మయూర్‌భంజ్‌లోని రామ్‌రంగ్‌పూర్ పట్టణంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోల్డింగ్‌లు వెలిశాయి.