కరోనా మహమ్మారిని అంతంచేసేందుకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్‌లో ఆయన తొలి డోసు టీకాను వేయించుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుతురు వచ్చారు. ఈఫోటోలను రాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మార్చి 1 నుంచి రెండో దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. 45 ఏళ్లు దాటి.. వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత టీకాలను ఇస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే కోవిడ్ టీకాను తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలు సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకోవాలనుకునేవారు.. తొలుత కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.