దాదాపు 24 ఏళ్ల నాటి ఎర్రకోటపై దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. జూలై 25, 2022న రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించిన రెండవ క్షమాభిక్ష పిటిషన్ ఇది. ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను ధృవీకరిస్తూ నవంబర్ 3, 2022న ఆరిఫ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మే 15న ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్ రాగా.. మే 27న తిరస్కరించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుండి ఉత్తర్వులు వచ్చాయి. ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు, ఆరిఫ్‌కు అనుకూలంగా ఎటువంటి ఉపశమన పరిస్థితులు లేవని తెలిపింది.
డిసెంబరు 22, 2000న జరిగిన ఈ దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న 7 రాజ్‌పుతానా రైఫిల్స్ యూనిట్‌పై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ జాతీయుడు, నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సభ్యుడు ఆరిఫ్‌ను దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.