రాష్ట్రపతి ఆమోదముద్ర.. చట్టంగా మారిన ట్రాన్స్‌జెండర్ల సవరణ బిల్లు
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
By - అంజి |
రాష్ట్రపతి ఆమోదముద్ర.. చట్టంగా మారిన ట్రాన్స్‌జెండర్ల సవరణ బిల్లు
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. మార్చి 25న రాజ్యసభ, అంతకుముందు రోజు లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అయితే, ఈ బిల్లులోని నిబంధనలు థర్డ్ జెండర్ వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, దీనిని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ, పార్లమెంటులో నిరసనల మధ్యే ఇది ఆమోదం పొందింది.
ఈ సవరణ చట్టం ప్రకారం 'ట్రాన్స్‌జెండర్' అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. 2019 చట్టం ప్రకారం స్వయంగా గుర్తించుకున్న లింగ గుర్తింపును (Self-identification) పరిగణనలోకి తీసుకోగా, కొత్త సవరణ ప్రకారం కేవలం జీవసంబంధమైన కారణాల (Biological reasons) వల్ల వివక్ష ఎదుర్కొనే వారిని మాత్రమే ట్రాన్స్‌జెండర్లుగా గుర్తిస్తారు. కిన్నెర, హిజ్రా, అరవాని, జోగ్తా వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపులు ఉన్నవారు, అంతర్గత అవయవాలు, క్రోమోజోమ్ నమూనాలలో తేడాలు ఉన్నవారిని మాత్రమే ఈ పరిధిలోకి తెచ్చారు. కేవలం తమ ఇష్టానుసారం లేదా స్వయం భావనతో లింగ గుర్తింపును మార్చుకునే వారికి (Self-perceived identities) ఈ రక్షణలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ చట్టంపై సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా తమ లింగాన్ని గుర్తించుకునే హక్కును (Right to self-identification) ఈ చట్టం కాలరాస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత తిరోగమన చట్టమని, దశాబ్దాల పురోగతిని ఇది వెనక్కి నెట్టేసిందని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. దాదాపు 140 మంది న్యాయవాదులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ బిల్లును ఆమోదించవద్దని రాష్ట్రపతిని కోరినప్పటికీ, ప్రభుత్వం మాత్రం అర్హులైన అణగారిన వర్గాలకు మాత్రమే ప్రయోజనాలు చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశామని సమర్థించుకుంటోంది.