జ్ఞానవాపి భూగర్భ గృహంలో 31 ఏళ్ల తర్వాత పూజలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 1:45 PM GMT
Gyanvapi, uttar pradesh, prayers performed,

 జ్ఞానవాపి భూగర్భ గృహంలో 31 ఏళ్ల తర్వాత పూజలు 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూగర్భ గృహంలోని హిందూ దేవతల విగ్రహాలకు బుధవారం రాత్రే పూజలు చేశారు. దీని కోసం ఓ పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలు వెలువడ్డ గంటల వ్యవధిలో ఈ పూజలు జరిగాయి. సీలు వేసి ఉన్న భూగర్భ గృహం మార్గాన్ని తెరిచి పూజలు చేశారు. హిందూ దేవతల విగ్రహాలకు మూడు దశాబ్దాల తర్వాత పూజలు జరగడంతో భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే.. ఈ పూజలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాగా.. దాదాపు 31 ఏళ్ల తర్వాత పూజల కోసం జ్ఞానవాపి మందిరంలోని భూగర్భ గృహం తెరుచుకుందని ట్రస్టు అధికారులు వెల్లడించారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూనే పూజలు చేసినట్లు చెప్పారు. కాశీ విశ్వనాథ ట్రస్టు పూజారి 'శయన హారతి' నిర్వహించి విగ్రహాల ముందు అఖండ జ్యోతిని వెలిగించారు. రోజుకు నాలుగు సార్లు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్ఉల చేశారు. జ్ఞానవాపి కాంప్లెక్స్‌ చుట్టూ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశామన్నారు.

Next Story