రాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్‌, అసెంబ్లీల్లో కొనసాగుతున్న పోలింగ్‌

Polling for the election of President is going on in Parliament and Assemblies. దేశ వ్యాప్తంగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో

By అంజి  Published on  18 July 2022 8:06 AM GMT
రాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్‌, అసెంబ్లీల్లో కొనసాగుతున్న పోలింగ్‌

దేశ వ్యాప్తంగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన బాక్సులో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఓటేశారు. కేంద్ర మంత్రులు కూడా అక్క‌డే ఓటేశారు. నేటి నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో.. వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీలు కూడా పార్ల‌మెంట్‌లోనే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అసెంబ్లీల్లో ఓటేసిన సీఎంలు

అలాగే రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు త‌మ త‌మ అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ల‌క్నో అసెంబ్లీలో ఓటేశారు. పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు కోల్‌క‌తాలోని అసెంబ్లీలో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓటేశారు. గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్ గాంధీన‌గ‌ర్‌లోని అసెంబ్లీలో ఓటు వేశారు. ఇంఫాల్‌లోని మ‌ణి పూర్ అసెంబ్లీలోనూ ఓటింగ్ కొన‌సాగుతోంది. భువ‌నేశ్వ‌ర్‌లో ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఓటేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో ఓటేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా అమ‌రావ‌తిలోని అసెంబ్లీలో ఓటేశారు. భోపాల్‌లో ఉన్న అసెంబ్లీలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఓటేశారు. సాయంత్రం 5 వ‌ర‌కు ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తార.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పోటీప‌డుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్‌

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేశారు. కాగా ఈఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో పోలింగ్‌

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు రోజా, తానేటి వనిత, బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ తరపున బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు.

వీల్‌చైర్‌లో వ‌చ్చి ఓటేసిన మ‌న్మోహ‌న్ సింగ్‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇవాళ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌కు వ‌చ్చి ఓటేశారు. అయితే ఆయ‌న ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు తెలుస్తోంది. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు మ‌న్మోహ‌న్ వీల్‌చైర్‌లో వ‌చ్చారు. పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయ‌న ఓటేశారు. వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌హ‌కారం తీసుకుని ఎంపీ మ‌న్మోహ‌న్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Next Story