నేడే భారత రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

Polling for presidential election to be held today. ఇవాళ 15వ రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులైన 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ

By అంజి  Published on  18 July 2022 1:54 AM GMT
నేడే భారత రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

ఇవాళ 15వ రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులైన 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో, రాష్ట్రాల్లోని అసెంబ్లీ భవనాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పత్రాల్లో ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సుల్లో వేస్తారు. జూలై 21 ఓట్ల లెక్కింపు, 25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇక బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మ, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు పింక్‌ రంగు బ్యాలెట్‌ పత్రాల్లో, ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాల్లో తమ ఓటు వేయనున్నారు. ఈ సారి ఎన్నికలు రెండు చాలా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి.

ఓటు విలువ ఎంత?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ వేరు వేరుగా ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రాల జనాభాను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ధారిస్తారు. ఎంపీలందరి ఓటు విలువ ఒకేలా (700) ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓట్ల విలువ 10,86,431గా ఉన్నది.

ఎవరు ఎవరివైపు?

బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, అన్నా డీఎంకే, టీడీపీ, జేడీ(ఎస్‌), శిరోమణి అకాలీదళ్‌, శివసేన, జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. ఇక విపక్షాల తరఫు అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కాంగ్రెస్‌తో పాటు టీఆఆర్‌ఎస్‌, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్‌, డీఎంకే, ఎస్పీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ, సీపీఐ(ఎం), ఎంఐఎం, ఆర్జేడీ, ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ తదితర 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్‌ కోసం శాసనసభ అసెంబ్లీ కమిటీ హాల్‌ల్లో, పార్లమెంట్‌లో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడి నుంచైనా (అంటే పార్లమెంట్‌లోనైనా, అసెంబ్లీలోనైనా) తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతంటే?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేల ఓటు విలువ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఓట్ల బలం 32,508. రాష్ట్రంలోని 24 ఎంపీలు, 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర జనాభాను అసెంబ్లీ సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువను ఒక్కో సభ్యుడి ఓటు విలువగా పరిగణిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలోని అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల ఒక్కో ఓటు హక్కు 132గా ఎన్నికల సంఘం నిర్ధారించింది.

Next Story