కూటి కొరకే కోటి విద్యలు అన్నట్టు ఉద్యోగం ప్రయత్నంలో యువత పెడదారి పడుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. శనివారం మహారాష్ట్రలో "జైలు పోలీస్ కానిస్టేబుల్" ఉద్యోగాల భర్తీ కోసం వ్రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఒక యువకుడు అనుమానాస్పద రీతిలో పరీక్ష రాస్తుండటం చూసి సూపర్ వైజర్ అతన్ని తనిఖీ చేయగా అతని దగ్గర ఒక ఐఫోన్ మరియు చిన్న ఇయర్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన "ఔరంగాబాద్" లోని "లల్టాకి కాంప్లెక్స్" జరిగింది.
పట్టుబడిన యువకుని పేరు "వికాస్ పరమ్ సింగ్ బర్వల్" అతను "అంబాద్ తాలూకా జల్నా" ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అతను వాట్సప్ ద్వారా ప్రశ్న పత్రం ఫోటో తీసి గ్రూప్ లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని పరీక్ష నుంచి తప్పించి తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇలాంటి ఘటనే "ఔరంగాబాద్ ప్రాంతంలోనే "జవహర్ నగర్" పోలీస్ స్టేషన్ పరిధిలో "జై భవాని స్కూల్" అనే సెంటర్ లో జరిగింది. "సోమనాథ్ విఠల్" అనే యువకుడు షర్ట్ లోపల టీ షర్టు ధరించి దానికి ఒక జేబు అమర్చుకుని, దానిలో ఒక మొబైల్ ఫోను, బ్లూటూత్ కనెక్టర్, చిన్న ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోవడం గమనించి పోలీసులు అతన్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళి విచారణ చేస్తున్నారు.