గన్‌ మిస్‌ఫైర్.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గన్‌ శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారి పేలింది.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 1:51 AM GMT
police, gun misfire, uttar pradesh, woman injured,

 గన్‌ మిస్‌ఫైర్.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

లోడ్‌ చేసి ఉన్న గన్‌ను అతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక పోలీసులు అయితే.. ఎప్పుడు తమ గన్‌ పేలకుండా లాక్‌ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని అనుకోని సందర్భంగాల్లో గన్‌ మిస్‌ఫైర్‌ అవుతూ ఉంటుంది. ఆ బుల్లెట్‌ ఎవరికీ తగలకపోతే ఓకే కానీ.. ఎవరి ప్రాణాలపైకి వచ్చిందంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఎస్‌ఐ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గన్‌ శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారి పేలింది. అక్కడే ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగింది ఈ సంఘటన. అలీగఢ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇష్రత్‌ అనే మహిళ పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం తన కుమారుడితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. పోలీస్‌ స్టేషన్‌లోనే తమ పత్రాలను పట్టుకుని నిల్చుని ఉంది. అప్పుడే ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌కు మరో పోలీసు తుపాకీ ఇచ్చివెళ్లాడు. ఆ తుపాకీని చూసి శుభ్రం చేయబోయాడు ఎస్ఐ మనోజ్‌ కుమార్‌. అనుకోకుండా లోడ్‌ అయి ఉన్న గన్ ఒక్కసారిగా పేలింది. అక్కడే నిల్చుని ఉన్న ఇష్రత్‌ తలలోకి దూసుకెళ్లింది. దాంతో.. ఆ మహిళ అక్కడే కుప్పకూలి పడిపోయింది.

వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు, ఆమె కుమారుడు మహిళను స్థానికంగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్ కాలేజ్‌కి తరలించారు. అయితే.. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్యులు చికిత్స చేస్తున్నారని ఎస్‌ఎస్పీ తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బుల్లెట్‌ ఇంకా ఆమె తలలోనే ఉందన్నారు. దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ నిర్వహించాలని.. దానిపైనే చర్చిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. కాగా.. గన్‌ మిస్‌ఫైర్ కావడంతో బుల్లెట్‌ మహిళ తల వెనుకభాగంలో తగిలిందని ఎస్‌ఎస్పీ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ను సస్పెండ్ చేశామన్నారు. అయితే.. ఈ సంఘటన తర్వాత సదురు ఎస్‌ఐ పరారు అయ్యాడనీ.. అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఎస్పీ చెప్పారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Next Story