కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పీఎం రాహత్' ...
By - అంజి |
కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పీఎం రాహత్' పథకానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా ప్రారంభించిన 'సేవాతీర్థ్' వేదికగా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం 80% వరకు ఉంటుంది.
నిరుపేదలు లేదా నగదు అందుబాటులో లేని వారు వైద్యం అందక మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి ఏ ఆసుపత్రిలో చేరినా (ప్రభుత్వ లేదా ప్రైవేట్), తక్షణ చికిత్స కోసం రూ. 1.5 లక్షల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీని కోసం బాధితులు ముందుగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం కేవలం బీమా ఉన్నవారికి లేదా ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలోని రోడ్డు ప్రమాద బాధితులందరికీ వర్తించేలా రూపకల్పన చేస్తున్నారు. 'సేవాతీర్థ్' లో భాగంగా ప్రధాని మోదీ తీసుకున్న అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నిర్ణయాల్లో ఇది మొదటిది.
చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు చెల్లిస్తేనే చికిత్స ప్రారంభిస్తాయి. 'పీఎం రాహత్' ద్వారా ఈ అడ్డంకి తొలగిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీతో ఆసుపత్రులు తక్షణమే అత్యవసర చికిత్సను అందించేలా మార్గదర్శకాలు రానున్నాయి. దీనిని అమలు చేయడానికి ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐడెంటిఫికేషన్ ద్వారా లేదా ఆసుపత్రి అడ్మిషన్ ద్వారా ఈ నిధులు నేరుగా ఆసుపత్రులకు చేరేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి గైడ్‌లైన్స్ త్వరలోనే వెలువడనున్నాయి.