మణిపూర్‌ ఘటన దేశానికే సిగ్గుచేటు.. ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని తీవ్రంగా స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 6:09 AM GMT
PM Narendra Modi, Manipur Incident, Parliament

మణిపూర్‌ ఘటన దేశానికే సిగ్గుచేటు.. ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన దేశానికే సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దీనికి పాల్పడ్డ వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే సమస్యే లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

మణిపూర్‌ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఇద్దరు మహిళల పట్ల అమానవీయ ప్రవర్తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. ఈ సంఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందనీ.. మణిపూర్‌ మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించలేమని వ్యాఖ్యానించారు. మహిళ భద్రత విషయంలో రాజీపడబోమని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను వదలిపెట్టమని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ.

మణిపూర్‌లో పోరుబాట పట్టిన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. వారిని నగ్నంగా ఊరంతా తిప్పించారు. ఈ ఘటన మే 4నే జరిగింది కానీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను అవమానించిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

పార్లమెంట్‌ సమావేశాల గురించిన మాట్లాడిన ప్రధాని మోదీ.. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చలు జరుపుదామని.. వాటి పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడేందుకు సమయం దొరుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ప్రధాని మోదీ.

Next Story