నేడు 14 -15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా
దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
By - అంజి |
నేడు 14 -15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా
దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడే లక్ష్యంగా ఇవాళ 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ జరగనుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 'స్వస్థ నారి' (ఆరోగ్యవంతమైన మహిళ) విజన్‌లో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా రావివలసలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లోని కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు.
ఎవరికి.. ఎక్కడ?
లక్ష్యం: ప్రతి ఏటా దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది (14 ఏళ్ల వయస్సు గల) బాలికలకు ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉచిత పంపిణీ: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ టీకా పూర్తి ఉచితంగా లభిస్తుంది.
ముందస్తు అనుమతి: ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా స్వచ్ఛందం. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకుంటారు.
గర్భాశయ క్యాన్సర్: భారత్‌లో భయానక గణాంకాలు
గ్లోబోకాన్ (GLOBOCAN) 2022 నివేదిక ప్రకారం భారత్‌లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. ఏటా 1.20 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. సుమారు 80 వేల మంది మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం 'హ్యూమన్ పాపిల్లోమా వైరస్' (HPV). ముఖ్యంగా 16, 18 రకాల వైరస్‌ల వల్ల 80% పైగా కేసులు వస్తున్నాయి. వీటిని టీకా ద్వారా సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.
ఏ టీకా ఇస్తున్నారు?
భారత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో 'గార్డసిల్' అనే క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తోంది. 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ జరిగిన ఈ టీకా, క్యాన్సర్ నివారణలో 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ టీకాతో భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 160కి పైగా దేశాల సరసన చేరింది. మొదటి మూడు నెలల పాటు మిషన్ మోడ్ లో ఈ ప్రత్యేక ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో అర్హులైన బాలికలు ప్రతిరోజూ టీకా తీసుకోవచ్చు. ఆ తర్వాత, ఇది సాధారణ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌లో భాగంగా మారుతుంది.