ఢిల్లీ వాసులను క్షమాపణ కోరిన ప్రధాని మోదీ..ఎందుకంటే..
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు.
By Srikanth Gundamalla
ఢిల్లీ వాసులను క్షమాపణ కోరిన ప్రధాని మోదీ..ఎందుకంటే..
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో జీ20 సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని ఢిల్లీ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. అయితే.. జీ20 సదస్సు కోసం ప్రపంచం నలుమూలల నుంచి ముఖ్యనేతలు ఎంతో మంది వస్తారని.. ఆ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి ఉంటుందని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు రవాణా విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతుయాని చెప్పారు. ఈ అసౌకర్యానికి ముందుగానే ఢిల్లీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే.. ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
జీ20 సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ మొత్తం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తుందని.. కానీ అతిథులు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఈ సదస్సుని విజయవంతం చేయడంలో ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక బాధ్యత ఉందని అన్నారు. దేశ ప్రతిష్టపై ఏ మాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలని ఢిల్లీ ప్రజలను ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు చాలా అసౌకర్యం కలుగుతుందని చెప్పారు.
కాగా.. సెప్టెంబర్ 9 నుంచి 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌తో ఆహ్వానిత అతిథి దేశాలకు చెందిన 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది.