పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాల కోరు అన్న మాట అన్ పార్లమెంటరీ పదం అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నేను అంటానని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన చాలెంజ్ ని నేను అంగీకరిస్తున్నా.. నేనేదైనా తప్పు చేసుంటే, రాజకీయాల నుంచి విరమించుకుంటానని మమతా చెప్పారు.
ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసినట్టు రుజువైతే, రెండు చేతులతో చెవులను పట్టుకుని, మోకాళ్లపై వంగుతూ గుంజీలు తీస్తే చాలని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న తేదీల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రచారం చేస్తున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా ఎనిమిది దశల్లో పోలింగ్ ను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ జరిగే రోజున ప్రధాని పర్యటనలను ఈసీ ఎందుకు నిషేధించడం లేదని.. పోలింగ్ తేదీలు ఉన్న రోజుల్లో నా ప్రచారాన్ని నిలిపివేసేందుకు నేను సిద్ధమే. నరేంద్ర మోదీ సిద్ధమా? అని కూడా దీదీ ప్రశ్నించారు.