పార్లమెంట్‌లో అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దు: ప్రధాని
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 7:03 AM GMTపార్లమెంట్‌లో అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దు: ప్రధాని
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న జీవో అవర్ సమయంలో ఇద్దరు యువకులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్‌లోకి దూకారు. ఆ తర్వాత క్యాన్సిస్టర్లతో పసుపు పొగను విడుదల చేశారు. దాంతో.. ఎంపీలంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఇదే సమయంలో పార్లమెంట్ బయట కూడా మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి పొగను వదిలారు. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు.. ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. అందుకే స్పీకర్ అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. దర్యాప్తు సంస్థలు కూడా సమగ్రంగా విచారణ జరుపుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పరిష్కారం కొనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు, ప్రతిఘటనలకు దారి ఇవ్వకుండా దూరంగా ఉండాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
కాగా.. పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితుల ఫోన్లను దహనం చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల వెనుక ఎవరున్నారు? ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.