508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన
దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 6 Aug 2023 6:44 AM GMT508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన
దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని తెలిపారు. అభివృద్ధి చేశాక ఈ రైల్వే స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయన్నారు. ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి.
వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. గుజరాత్, తెలంగాణలో ఒక్కొక్కటి 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున రైల్వే స్టేషన్లు, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రూ. 24,470 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పునరాభివృద్ధి, చక్కగా డిజైన్ చేయబడిన ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్, ప్రయాణీకుల మార్గదర్శకత్వం కోసం చక్కగా రూపొందించబడిన సంకేతాలతో పాటు ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందజేస్తుందని పీఎంవో కార్యాలయం తెలిపింది.
భవనాలు స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందుతాయి. అత్యాధునిక ప్రజారవాణా సదుపాయం కోసం మోదీ చర్యలు తీసుకున్నారు. ప్రజల రవాణాకు రైల్వేలు అత్యంత ప్రాధాన్యతనిస్తాయని పేర్కొన్న పీఎంఓ, రైల్వే స్టేషన్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడంపై ఆయన ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఈ దృక్పథంతో 1,309 స్టేషన్లను పునరాభివృద్ధి చేసేందుకు 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' ప్రారంభించబడిందని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
కాగా ఏపీలో కాకినాడ టౌన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూల్ సిటీ, దేవరకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, భీమవరం టౌన్, ఏలూరు, నర్సాపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లి గూడెం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదిలాబాద్, ఖాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హుప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట్, జనగామ, కరీమ్ నగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, రామగుండం, మల్కాజ్ గిరి జంక్షన్, తాండూర్, యాదాద్రి స్టేషన్లు అభివృద్ధికి నోచుకోనున్నాయి.