కెవిన్‌ పీటర్సన్ ట్వీట్‌పై స్పందించిన ప్ర‌ధాని మోదీ

PM Modi Lauds Kevin Pietersen's Affection Towards India. ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ చేసిన ట్వీట్ కు స్పందించిన ప్ర‌ధాని మోదీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 4:36 AM GMT
PM Modi Lauds Kevin Pietersen’s Affection Towards India

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇక మ‌న‌దేశానికి చెందిన రెండు వ్యాక్సిన్లు.. మిగ‌తా క‌రోనా వ్యాక్సిన్ల‌తో పోలిస్తే స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయి. దీంతో ప్ర‌పంచ‌దేశాల‌ను ఆదుకునేందుకు భార‌త్ ముందుకొచ్చింది. దాదాపు వంద‌కు పైగా దేశాల‌కు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అధికంగా ఉండ‌డంతో.. సోమ‌వారం జోహెన‌స్‌బ‌ర్గ్‌కు విమానంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపించారు.


అందుకు సంబంధించిన ఓ ఫోటోను విదేశాంగ శాఖ మంత్రి జ‌య‌శంక‌ర్ ట్వీట్ చేయ‌గా.. దానిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ స్పందించాడు. 'భార‌త ద‌యాగుణం పెరిగిపోతోందని, అది చాలా ప్రియమైన దేశం' అంటూ ప్ర‌శంసించాడు. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్పందించారు. భారత్‌ పట్ల పీట‌ర్స‌న్‌కు ఉన్న‌ ప్రేమను చూసి సంతోషించాన‌ని చెప్పారు. 'ప్రపంచమంతా కుటుంబమనేన‌ని భార‌త్ భావిస్తుంద‌ని.. క‌రోనాపై పోరాటంలో త‌మ‌ వంతు సాయం అందిస్తామ‌ని' ట్వీట్ చేశారు.


ఇక స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా పీటర్సన్ భార‌త్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉంటారు. కాగా.. ఆస్ట్రేలియా జ‌ట్టు దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకున్న విష‌యంపై పీట‌ర్స‌న్ స్పందిస్తూ అది స‌రికాద‌ని అన్నారు. ఒక‌వేళ ఇది దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ బదులు భారత పర్యటన అయితే ఆస్ట్రేలియా జ‌ట్టు‌ ఇలా చేసేది కాదన్నారు. తమ దేశ‌ జట్టు కూడా దక్షిణాఫ్రికా టూర్‌ను రద్దు చేసుకున్న విష‌యాన్ని గుర్తుచేసుకున్నారు.


Next Story