బంగ్లా కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్.. ప్రమాణస్వీకారానికి మోదీకి ఆహ్వానం!
బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత ప్రజాస్వామ్య యుగం మొదలైంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత...
By - అంజి |
బంగ్లా కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్.. ప్రమాణస్వీకారానికి మోదీకి ఆహ్వానం!
బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత ప్రజాస్వామ్య యుగం మొదలైంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన మొదటి జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ నాయకుడు తారిఖ్ రెహ్మాన్ ఫిబ్రవరి 17న బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి హాజరుకావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బీఎన్‌పీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. మొత్తం 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ 209 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇక పాకిస్థాన్‌కు అనుకూలంగా భావించే జమాయతే ఇస్లామీ పార్టీ 68 స్థానాలను గెలుచుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురైంది. ఈ ఎన్నికల్లో 59.44 శాతం ఓటింగ్ నమోదైంది.
మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ రెహ్మాన్, దాదాపు 17 ఏళ్ల పాటు లండన్‌లో ప్రవాస జీవితం గడిపారు. తన తండ్రి జియావుర్ రెహ్మాన్ స్థాపించిన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దేశ నాయకుడిగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు.
మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ పంపిన ఆహ్వానాన్ని అందుకున్న 13 దేశాలలో భారత్ ఒకటి. చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే, ప్రధాని మోదీ ఈ వేడుకకు వెళ్తారా లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.
కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోదీ శనివారం తారిఖ్ రెహ్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. "బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న పొరుగు దేశాలుగా మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల కోసం కలిసి పనిచేస్తాం" అని మోదీ తన 'X' (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.