2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు: ప్రధాని మోదీ
మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 5:45 PM IST2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు: ప్రధాని మోదీ
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలిసారి వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లెట్ (టీవీ-డీ1) క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను అక్టోబరు 21న పరీక్షించనున్నారు. ఆ కార్యక్రమ సన్నద్ధత, ప్రయోగ ఏర్పాట్లపై ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా సైంటిస్టులు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు.
చంద్రయాన్-3 చారిత్రక విజయం, ఆదిత్య-ఎల్ ప్రయోగం ద్వారా అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలని ప్రధాని మోదీ చెప్పారు. రాబోయే 20 ఏళ్లకు మరిన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతుందని.. అలాగే 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగుపెట్టాలని లక్ష్యం పెట్టుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ విషయాలను ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
2025 నాటికి గగన్‌యాన్‌లో మిషన్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. 20 ప్రధాన పరీక్షలు జరుగుతుండగా.. మొదటిది క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష అక్టోబర్ 21న చేపటనున్నట్లు చెప్పారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం.. దానిని సముద్రంలో పడేలా చేయడం.. అనంతరం మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేయనున్నారు. ఇక ఇండియన్ నేవీ కూడా తిరిగి మాడ్యూల్‌ను పొందేందుకు అవసరమైన మాక్ ఆపరేషన్లు చేపట్టిందని ఇస్రో చీఫ్ అన్నారు. కాగా.. అంతరిక్షంలో వ్యోమనౌక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని తిరిగి భూమికి తీసుకురావడంలో ఈ టెస్టు సాయపడనుంది.