డీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ఈ డీప్ ఫేక్ టెక్నాలజీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 3:00 PM ISTడీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగకరం ఉందో.. దానిని పెడదారిన ఉపయోగిస్తే ఎలాంటి అనార్ధాలు ఉంటాయో ఈ మధ్య కాలంలో బాగా అర్థం అవుతోంది. ఏఐ టెక్నాలజీ డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల కలవర పెడుతున్నాయి. రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి వారి వీడియోలను కొందరు డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దాంతో.. అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇలా రోజూ ఒక వీడియో ఎవరిదో ఒక సెలబ్రిటీ డీప్ ఫేక్ వీడియో దర్శనం ఇస్తూనే ఉంది. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.
కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ దీనిపై స్పందించారు. సినిమా ప్రముఖుల వీడియోలే కాదు.. తాను కూడా పాట పాడినట్లుగా వీడియోలు క్రియేట్ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయని ఆయన చెప్పారు. ఇవి సమాజంలో గందరగోళానికి కారణం అవుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డీప్ ఫేక్ వీడియోలపై మీడియా, సోషల్ మీడియా ప్రజలకు అవకగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలను క్రియేట్ చేసే ప్రమాదం ఉన్నందున.. అమ్మాయిలు ఇలాంటి వాటిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాల్లో డీపీలకు లాక్‌లు వేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే.. ఇలాంటి వాటి గురించి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.