ఎవరినీ వదిలిపెట్టను..కేసీఆర్ కుటుంబంపై మోదీ సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 6:19 PM ISTఎవరినీ వదిలిపెట్టను..కేసీఆర్ కుటుంబంపై మోదీ సంచలన కామెంట్స్
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. భోపాల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సభలోనే విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాలపై ప్రస్తావించి.. ములాయం సింగ్, లాలూ, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి ఇలా ప్రముఖ నేతలను విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కేసీఆర్, తన కూతురుకి మేలు చేయాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. మీరు.. మీ పిల్లలు బాగుపడాలంటే బీజేపీ ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేంద్రం కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శించాయి. ఎమ్మెల్సీ కవిత పేరుని చార్జ్‌షీట్లలో పలుమార్లు ప్రస్తావించినా.. ఇప్పటికీ అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి సంబంధం లేదన్న సంకేతాలను జనాలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అంతకుముందు పాట్నాలో కూడా అవినీతిపరులు ఎవరినీ వదలిపెట్టనని.. కుంభకోణాలు చేసినవారికి చట్టప్రకారం శిక్షలు పడేలా చేస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.