కేర‌ళ అనూహ్య నిర్ణ‌యం.. ఇత‌ర రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ ఇవ్వ‌లేం

Pinarayi Vijayan says we will not supply oxygen to other states. కేర‌ళ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. త‌మ రాష్ట్రంలో ఉత్ప‌త్తి అయిన ఆక్సిజ‌న్‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌లేమ‌ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 1:10 PM IST
Kerala CM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ ఉద్దృతి కొన‌సాగుతోంది. దీంతో దాదాపు ఆస్ప‌త్రుల‌న్ని క‌రోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేర‌ళ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. త‌మ రాష్ట్రంలో ఉత్ప‌త్తి అయిన ఆక్సిజ‌న్‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌లేమ‌ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను పొరుగు రాష్ట్రాల‌కు పంపిణీ చేశామ‌ని.. ప్ర‌స్తుతం 86 మెట్రిక్ ట‌న్నుల అత్య‌వ‌స‌ర నిల్వ‌లు మాత్ర‌మే ఉన్న‌ట్లు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ నెల 10 వరకు 40 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును తమిళనాడుకు సరఫరా చేశామని, కానీ పరిస్థితిని బట్టి చూస్తే ఇక ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకు అందజేయలేమన్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ రాష్ట్రంలో 4,02,640 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని.. ఈ నెల 15 నాటికి 6ల‌క్ష‌ల‌కు చేరే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆ రోజు నాటికి 450 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఇంకా తమకు మరిన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లు అవసరమని విజయన్ తెలిపారు. మొదట కేరళ.. నేషనల్ గ్రిడ్ పై ఒత్తిడి తేకుండా 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని పొందగలిగింది. కానీ పొరుగు రాష్ట్రాల డిమాండు దృష్ట్యా ఆ రాష్ట్రాలకు ఈ ప్రాణ వాయువును పంపడంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో ఐనాక్స్ ప్రధానమైందన్నారు. దీని తయారీ సామర్థ్యం 150 మెట్రిక్‌ టన్నులని పేర్కొన్నారు. మొత్తం ఇతర చిన్న ప్లాంట్లతో కలిపి రాష్ట్రంలో రోజుకి 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇక ప్రధాన స్టీల్‌ ప్లాంట్లన్నీ కేరళకు భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కేరళలో ఉత్పత్తవుతున్న మొత్తం ఆక్సిజన్‌ తమ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు.


Next Story