ఆశలు ఆవిరి.. పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి రావు..!
Petrol, Diesel not coming under GST any time soon. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదని..
By Medi Samrat Published on 24 March 2021 7:02 PM ISTపెట్రోల్-డీజిల్ ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే పెట్రోల్-డీజిల్ లపై పెద్ద ఎత్తున పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ ఉన్నాయి. ఒకవేళ పెట్రోల్-డీజిల్ ధరలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకుని వస్తే చాలా వరకూ ధరలు తగ్గుతాయని పలు సంస్థలు, నేతలు చెప్పుకొచ్చారు. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఒప్పుకోవు కాబట్టి తాము కూడా ఒప్పుకోమని చెబుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం తాజాగా భారతీయ జనతా పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మరో ఎనిమిది, పదేళ్ల వరకు సాధ్యం కాదని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. బుధవారం రాజ్యసభలో 2021 ఆర్థిక బిల్లు అంశంపై ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం వల్ల రాష్ట్రాలు ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోతాయని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదని.. ఇందుకు రాష్ట్రాలు ఎంత మాత్రమూ ఒప్పుకోవని తేల్చేశారు.
పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలకు ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతాయని.. ప్రస్తుతం వీటిపై 60 శాతం పన్ను వసూలు చేస్తుండగా... దీని వల్ల పెట్రోల్, డీజిల్ పై వచ్చే ప్రతి 60 రూపాయల్లో 35 రూపాయలు కేంద్రానికి, 25 రూపాయలు రాష్ట్రాలకు వెళ్తున్నాయని.. అదే 28 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తే కేవలం 14 రూపాయలు మాత్రమే వస్తాయని రాజ్యసభలో సుశీల్ కుమార్ మోదీ చెప్పుకొచ్చారు. ఇంధనాలపై వసూలు చేస్తున్న పన్నులతో పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. కాబట్టి ఇప్పట్లో పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేలా కనిపించడం లేదు.