40 ఏళ్ల భర్తను కాదని ప్రియుడితో వెళ్లిన 19 ఏళ్ల యువతి.. ఒకే చెప్పిన హైకోర్టు
మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ఇటీవల వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఒక వయోజన మహిళా నిర్ణయాధికారానికి సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది.
By - అంజి |
40 ఏళ్ల భర్తను కాదని ప్రియుడితో వెళ్లిన 19 ఏళ్ల యువతి.. ఒకే చెప్పిన హైకోర్టు
మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ఇటీవల వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఒక వయోజన మహిళా నిర్ణయాధికారానికి సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది. భర్త, తల్లిదండ్రులు ఒకవైపు.. తను ప్రేమించిన భాగస్వామి మరోవైపు ఉన్న తరుణంలో, ఆ 19 ఏళ్ల యువతి తన జీవిత గమనాన్ని తానే నిర్ణయించుకుంది. ఈ వివాదం ఒక 'హేబియస్ కార్పస్' (Habeas Corpus) పిటిషన్‌తో మొదలైంది. తన భార్యను అనుజ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు ఆ యువతిని గుర్తించి, కోర్టు ముందు హాజరుపరిచే వరకు ఒక 'వన్-స్టాప్ సెంటర్'లో ఉంచారు.
ఈ క్రమంలోనే న్యాయమూర్తులు ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె ఎటువంటి తడబాటు లేకుండా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. "నేను మేజర్‌ని. నా స్వతంత్ర ఇష్టప్రకారమే జీవిస్తున్నాను. నేను నా భర్తతో గానీ, తల్లిదండ్రులతో గానీ ఉండాలని అనుకోవడం లేదు" అని ఆమె కోర్టుకు తెలిపింది. తన భర్తకు 40 ఏళ్లు, తనకు 19 ఏళ్లు అని.. వారిద్దరి మధ్య ఉన్న 21 ఏళ్ల వయస్సు వ్యత్యాసం వల్ల ఆ వివాహ బంధం ఎప్పుడూ సజావుగా సాగలేదని వివరించింది. అంతేకాకుండా, భర్త తనను వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. కోర్టు ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించినప్పటికీ, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె భాగస్వామి కూడా కోర్టులో హాజరై, ఆమె భద్రతకు తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు.
ఒక వయోజన వ్యక్తి (Adult) ఎవరితో ఉండాలి, ఎక్కడ నివసించాలి అనేది నిర్ణయించుకునే పూర్తి హక్కు ఆమెకే ఉంటుందని కోర్టు పునరుద్ఘాటించింది. ఆమె ఎవరి నిర్బంధంలోనూ లేదని స్పష్టమవడంతో, భర్త వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆమెను తన భాగస్వామితో వెళ్ళడానికి అనుమతించింది. తీర్పుతో పాటు ఆమె భద్రతపై కూడా కోర్టు ప్రత్యేక శ్రద్ధ చూపింది. రాబోయే ఆరు నెలల పాటు 'శౌర్య దీదీ' అనే పేరుతో పిలువబడే మహిళా అధికారులు ఆమెతో టచ్‌లో ఉండి, ఆమె క్షేమ సమాచారాన్ని పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు మహిళా హక్కుల విషయంలో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచింది.