ఇక నుంచి పేపర్ లెస్‌గా పాస్‌పోర్టు
Passport services integrated with DigiLocker platform. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat
పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలను డిజిలాకర్‌తో అనుసంధానం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిజిలాకర్‌లో ఉన్న ధృవపత్రాలను ధృవీకరణ కోసం ఇక మీదట ఉపయోగించకోవచ్చని స్పష్టం చేసింది. ఈ కొత్త సౌకర్యం వల్ల దరఖాస్తు దారుడు పాస్‌పోర్టు కేంద్రానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈమేరకు పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టుకు సంబంధించి డిజిలాకర్ ప్లాట్‌ఫామ్‌ను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు సదుపాయంతో దరఖాస్తుదారులు కాగిత రహిత విధానంలో అవసరమైన పత్రాలను సమర్పించుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు. పాస్‌పోర్టును పోగొట్టుకున్న సమయంలో కొత్తది జారీ చేయడానికి డిజిలాకర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత ఆరేళ్లలో పాస్‌పోర్టు సంబంధిత సేవల్లో ఎంతో పెరుగుదల కనిపించిందని అన్నారు. పాస్‌పోర్టు కోసం చేసుకునే దరఖాస్తుల సంఖ్య నెలల్లో అత్యధికంగా 10 లక్షల మార్క్‌ను 2017లో అధిగమించిందన్నారు. ఇప్పటి వరకు పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు ద్వారా 7 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయి అని మంత్రి వెల్లడించారు. ప్రజల ముందుకే పాస్‌పోర్టు సర్వీసులను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.