తమిళనాడులో అంతే.. ఏకంగా కోసేసుకున్నాడు

Party Worker Cut Off his Little Finger to Ensure Victory to DMK. తమిళనాడులో స్టాలిన్ గెలవాలని ఓ కార్యకర్త ఏకంగా వేలునే కోసేసుకున్నాడు.

By Medi Samrat  Published on  4 April 2021 3:49 PM IST
Party worker cut off his finger

తమిళనాడు ఎన్నికలంటే ఎమోషన్.. అక్కడి నాయకుల మీద అభిమానం కార్యకర్తల్లో అలాగే ఉంటుంది. వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కార్యకర్తలు ఏ త్యాగానికైనా వెనుకాడరు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నాయకులు తలమునకలై ఉన్నారు. డీఎంకే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నాడని అన్నారు. అయితే ఆయన గెలవాలని ఓ కార్యకర్త ఏకంగా వేలునే కోసేసుకున్నాడు. ఇది అభిమానమో, మూర్ఖత్వమో తెలియని పరిస్థితి.

డీఎంకే కార్యకర్త అయినటువంటి గురవయ్యకు స్టాలిన్ అంటే ఎంతో అభిమానం. అతనో కార్మికుడు విరుధునగర్‌లో ఉంటున్నాడు. 66 సంవత్సరాల ఆయనకు డీఎంకే మీద వీరాభిమానం కారణంగా ఎన్నికలంటే చాలు.. ఆ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తూనే ఉంటాడు. పదేళ్లుగా తన పార్టీ అధికారానికి దూరంగా ఉండటంతో... ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాడు. 2011 లేదా 2016లో పార్టీ అధికారంలోకి వస్తుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నాడు గురవయ్య.

కానీ అది వీలుపడలేదు. ఈసారి మాత్రం తన పార్టీ గెలవాలని మరియమ్మన్ ఆలయానికి వెళ్లాడు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవాలనీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ తన ఎడమ చేతి చిటికెన వేలును కట్ చేసుకున్నాడు. ఆయన చేసిన పని ఇప్పుడు తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి పని చేయకండని నాయకులు చెబుతున్నా.. ఇలాంటి వీరాభిమానులు మాత్రం వారి మాటలను అసలు పట్టించుకోరు. ఎంతకైనా తమిళనాడులో అభిమానానికి ఓ లిమిట్ అంటూ లేదని పలువురు అంటున్నారు.


Next Story