పోటీ పరీక్షల్లో అక్రమాలపై పదేళ్ల జైలు, రూ.కోటి జరిమానా: కేంద్రం బిల్లు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది.

By Srikanth Gundamalla  Published on  5 Feb 2024 3:44 PM IST
parliament session, central govt, new bill ,

పోటీ పరీక్షల్లో అక్రమాలపై పదేళ్ల జైలు, రూ.కోటి జరిమానా: కేంద్రం బిల్లు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రాతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి అక్రమాలకు పాల్పడితే కొరడా ఝుళిపించేందుకు కేంద్రం సిద్దమవుతుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్) బిల్లును లోక్‌సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టింది. అయితే.. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు నేరం రుజువు అయితే పేదళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధించేలా కేంద్రం బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. అక్రమార్కులతో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులపై కూడా ఈ బిల్లు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే.. గతంలో రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీలతో పలు పోటీ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. దాంతో.. నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారి బాధను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. మరోవైపు ఈ బిల్లు విద్యార్థులు లక్ష్యం కాదని కూడా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది.

కాగా.. బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభయిన విషయం తెలిసిందే. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడు రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ బిల్లు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసునని.. ఈ సమస్యపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్రపతి ప్రసంగంలో తెలిపారు. ఇక తాజాగా ఇవే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును కూడా ప్రవేశపెట్టింది.

Next Story