నాకు పెళ్లైంది, కోపం రాదు..రాజ్యసభలో నవ్వులు పూయించిన చైర్మన్ ధన్కడ్

రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ దన్కడ్ వ్యాఖ్యలతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 10:26 AM GMT
Parliament, Rajya Sabha, Chairman Dhankar, Congress, kharge,

నాకు పెళ్లైంది, కోపం రాదు..రాజ్యసభలో నవ్వులు పూయించిన చైర్మన్ ధన్కడ్

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి మణిపూర్‌ సంఘటనపై రోజూ విపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం మాత్రం కాస్త చల్లబడింది. మణిపూర్‌ హింపై చర్చ విషయంలో ఉప్పునిప్పులా ఉన్న అధికార విపక్షాలు కాసేపు కామ్‌గా ఉన్నాయి. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ దన్కడ్ వ్యాఖ్యలతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రూల్‌ 267కు ప్రాధాన్యమిస్తూ సభా కార్యకలాపాలను వాయిదా వేయాలన్నారు. మణిపూర్‌ సమస్యపై చర్చ పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా బుధవారం రాజ్యసభ చైర్మన్‌ను తాము కలిసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు గుర్తు చేశారు మల్లికార్జున ఖర్గే.

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్కడ్‌ కౌంటర్‌గా నవ్వులు పూయించారు. తనకు పెళ్లి అయిపోయిందని, 45 ఏళ్లు దాటిందని చెప్పారు. నన్ను నమ్మండి సార్‌.. నేను ఎప్పుడూ కోపంగా లేను అంటూ జగదీప్‌ ధన్కడ్‌ చెప్పుకొచ్చారు. రాజ్యసభ చైర్మన్‌ వ్యాఖ్యలతో సభలో ఉన్న సభ్యులంతా ఒక్కసారిగా నవ్వేశారు. విశిష్ట న్యాయవాది చిదంబరం గారికి బాగా తెలుసు.. న్యాయవాదులుగా కనీసం అధికారులపై కూడా కోపం చూపించే హక్కు తమకు లేదని అన్నారు. తాను ఎప్పుడూ కోపంగా లేనని..ఆయన వ్యాఖ్యలను సవరించుకోవాలని ఖర్గేతో అన్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్కడ్.

మల్లికార్జు ఖర్గే కూడా అంతటితో ఆగకుండా మరోసారి సభ్యులంతా నవ్వేలా మాట్లాడారు. బహుశా రాజ్యసభ చైర్మన్‌ కోపాన్ని ప్రదర్శించరు కానీ.. ఆగ్రహానికి మాత్రం గురవుతారని అన్నారు. లోలోపల కోపంగా ఉంటారని అన్నారు. దాంతో.. మరోసారి సభ్యులంతా నవ్వేశారు. ఈ సమయంలో తన భార్య గురించి ప్రస్తావించిన జగదీప్‌ ధన్కడ్.. ఆమె ఈ సభలో సభ్యురాలు కాదని.. అందుకే ఆమె గురించి చర్చించడం సబబు కాదని అన్నారు. ఆమె ఈ సభలో ఉండి ఉంటే కచ్చితంగా చర్చించే వాడిని అంటూ చమత్కరించారు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్కడ్. కొన్నాళ్లుగా పార్లమెంట్‌ సమావేశాల్లో మణిపూర్‌ హింసపై చర్చించాలంటూ.. మోదీ సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సభ లోపల బయట కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.


Next Story