లోక్‌సభ నుంచి 33 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 4:36 PM IST
parliament, delhi, lok sabha, 30 mps, suspension,

లోక్‌సభ నుంచి 33 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. పార్లమెంట్‌లో గత వారంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం అంశం ఉభయసభలను హోరెత్తిస్తోంది. విపక్షాలు భద్రతా వైఫల్యం చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దాంతో.. లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు లోక్‌సభలో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్‌ మరోసారి సస్పెన్షన్ విధించారు. మొత్తం 33 మందిని లోక్‌సభ స్పీకర్‌ సస్పెండ్ చేశారు. వీరిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి కూడా ఉన్నారు

సస్పెన్షన్‌కు గురైన 33 మంది విపక్ష ఎంపీల్లో.. 30 మంది సభ్యులపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతోంది. మరో ముగ్గురి సస్పెన్షన్ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్‌ సెషన్ జరుగుతున్న సమయంలో విపక్ష ఎంపీలు పలువురు లోక్‌సభ స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేశారు. మరోవైపు శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ గురైన వారిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్‌ రంజన్ చౌదరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీలు సౌగత్ రాయ్, కల్యాణ్‌ బెనర్జీ కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు.

లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత గురువారమే వీరిపై వేటు పడింది. మొత్తం ఈ సమావేశాల్లో 46 మంది సభ్యులను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అయ్యింది. రాజ్యసభలో కూడా టీఎంసీ ఎంపీ డిరెక్‌ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై కూడా ఈ శీతాకాల సమావేశాలు జరిగే వరకు సస్పెన్షన్‌కు గురయ్యారు.

Next Story